- నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
జడ్చర్ల టౌన్, వెలుగు: వచ్చే ఏడాదిలోపు ఉదండాపూర్ వరకు పాలమూరు లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తో కలిసి ఆయన పాల్గొన్నారు. త్వరలో లక్ష్మిదేవిపల్లి వరకు భూ సేకరణ మొదలు పెడతామని, ఆర్ అండ్ఆర్, అటవీశాఖకు సంబంధించిన సమస్యలను ఆరు నెలల్లోపు పరిష్కరిస్తామని చెప్పారు.
ఉదండాపూర్ నిర్వాసితులకు నెల రోజుల్లోనే రూ. 630 కోట్లు పరిహారం అందించామన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్ లో ఉన్న బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను తమ హయాంలోనే పూర్తి చేస్తామని, మక్తల్, నారయణపేట్, కొడంగల్ లిఫ్ట్ పనులను ఏడాదిన్నరలో పూర్తి చేస్తామన్నారు. ఈ యాసంగిలో 71లక్షల టన్నుల వడ్లు కొని, రైతుల ఖాతాల్లో 14వేల కోట్లు జమ చేశామన్నారు. గత పదేండ్లలో బీఆర్ఎస్ కొనుగోలు చేసిన వడ్లకన్నా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కన్నా తామే ఎక్కువ కొనుగోలు చేశామన్నారు. బీఆర్ఎస్, బీజేపీ అడ్డగోలుగా మాట్లాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతాంగం ఆకాంక్ష నెరవేరబోతోంది: జూపల్లి
సీఎం పర్యటనతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పనుల్లో వేగం పుంజుకొంటుందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులు పాదయాత్రలంటూ కల్లబొల్లి మాటలు చెప్తున్నారని, పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు వారు ఏంచేశారని ప్రశ్నించారు. కాళేశ్వరం పేరిట లక్ష కోట్లు ఖర్చు పెట్టిన ఘనుడు పాలమూరు ప్రాజెక్టులు ఎందుకు కట్టలేదని నిలదీశారు.
ఇది చేతల ప్రభుత్వం: వాకిటి శ్రీహరి
తమ ప్రభుత్వం మాటలు చేప్పే ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వమని, సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు రాక ముందే ఉదండాపూర్ భూ నిర్వాసితుల ఖాతాలో డబ్బులు జమ చేశామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్న కూడా రైతులందరికీ న్యాయం జరగాలని పరిహారం డబ్బులు రైతుల ఖాతాలో వేశామన్నారు.
